ABN -ANDHRA JYOTHI

ABN Andhrajyothy Live TV

Thursday, March 25, 2010

2.6.0 కొల్లాపూర్ ప్రాంత ముగింపు:

2.6.0 ముగింపు :ఒకప్పుడు కొలుముల పల్లెగా పిలిచిన కొల్లాపూర్ క్రీ.శ. 1840
నుంచి సురభి వంశస్తులైన వెలమ దొరలకు రాజధానిగా స్వాతంత్ర్యం వచ్చేవరకు కొనసాగింది.
కొల్లాపూర్(జ్తప్రోలు) సంస్థానంలో పూర్వం ఎంతోమంది విద్వత్ కవులు తమ పాండిత్య
ప్రకర్షను చాటుకొన్నారు. సాహితీలోకంలో ప్రసిద్ధమైన చంద్రికా పరిణయ కర్త సురభి
మాధవరయలు కొల్లాపూర్ సంస్థానానికి చెందినవారే. కొల్లాపూర్ ప్రాంతంలోని పానగల్
ఖిల్లా, సోమశిల దేవాలయాలు, ఆంకాళమ్మ కోట, అమరగిరి, మల్లేశ్వరం, చిన్నమరూరు,
పెద్దమరూరు, కల్వకోలు సింగపట్టణం చారిత్రికంగా ప్రసిద్ధికెక్కిన ప్రాంతాలు.

2.5.5 కల్వకోలు చారిత్రక శివాలయం :

పెద్ద కొత్తపల్లి మండల కేంద్రానికి 15 కి.మీ
దూరంలో కల్వకోలు గ్రామం ఉంది. దీన్ని పూర్వం 'కైరకాసారపూరపురం ' అనేవారు.
ఊరి వెలుపల నందికేశ్వరుడి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఈశాన్య దిశలో వున్న
'కల్వపూల కొలను'పేరుమీదుగా ఈ ఊరికి కల్వకోలు అని పేరు వచ్చినట్లు తామ్రపత్ర
శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ. 1247 దుర్మతీనామ సంవత్సరంలో నందికేశ్వరుడి
ఆలయాన్ని, జయలక్ష్మీపతి అనబడే గోన ప్రభువు ఈ ఆలయాన్ని కట్టించినట్లు తెల్సుస్తోంది.
తర్వాతి కాలంలో అనగా 1423 శాలివాహన శకంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పానుగంటి
శేషా చలపతి రాజు ఈ ఆలయాభివృద్ధికై పంటభూములను దానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత వుంది. ఏడు శివలింగాల ఒకదానిపై
మరొకటి ఉండేలా తీర్చిదిద్దారు. శిల్పి శివలింగ పాన పట్టాలను లింగంతో సహా గిన్నెల వలె
మడిచి ఒకదానిపై మరొకటి రూపొందించాడు. అంతేగాకుండా పాన పట్టాలకు లింగం
చుట్టూ సూక్ష్మమైన రంధ్రాలను చెక్కినారు. ఆ శివలింగానికి భక్తులు అర్చించే అభిషేక
జలం ఏడింటికీ అందుతూ సప్త లింగాభిషేకం ఒకేసారి జరిగేలా ఏర్పాటు చేసిన శిల్పి కళా
కౌశలం ప్రశంసనీయం. ముస్లింల దండయాత్ర వలన ఈ శివలింగం పైభాగం విరిగిపోయింది.
ఇక్కడ ఆలయం ముందు గల మరో నందిని గుప్త నిధుల ఆశతో దుండగులు నడుము
వరకు విరగ్గొట్టారు. 1968 సంవతరంలో దేవాలయ పరిసర ప్రాంత రైతులు తమ
పొలాల్లో త్రవ్వకాలు సాగిస్తుండగా వీరభద్రుడి విగ్రహంతో పాటు ఒక దీర్ఘచతురస్రాకార
శిలా శాసనపు రాతిస్థంభం ఒకటి బయల్పడింది. ఈ ఆలయంలో ఆలనాపాలనా లేక, సంరక్షణ
కరువైన విలువైన శిల్పసంపద ఎంతో వుంది. అపురూపమైన శిల్పాలు ఎండకు ఎండుతూ,
వానకు తడుస్తూ శిథిలావస్థకు చేరుకోవడం చూపరులను కలచివేస్తుంది.

2.5.4 అమరగిరి :

ల్లమల అడవుల్లో ప్రవహించే కృష్ణానది సమీపంలో అతి
మనోహరమైన ప్రాంతం అమరగిరి. కొల్లాపూర్ మండల కేంద్రానికి 10 కి.మీ. దూరంలో
నల్లమల కొండల్లో ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి మాత ఒడిలో ఈ అమరగిరి ప్రాంతం
ఉంది. అమరగిరి ప్రక్కన గలగలమని పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించే కృష్ణానదిలో పడవ
షికారు చేయవచ్చు ఈ ప్రాంతం చుట్టూ అడవి ఆవరించి ఉండటం వల్ల విహారయాత్రలకు
ఎంతో అనువైంది. పూర్వం జటప్రోలు సంస్థానాదీశుల కాలంలో అమరగిరి ప్రాంతానికి
పోవడానికి వీలుగా రహదారి ఉండేదట. కానీ నేడు ఈ ప్రాంతానికి ద్విచక్ర వాహనాల్లో
వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంది.

2.5.3 ఆంకాళమ్మ కోట

2.5.3 ఆంకాళమ్మ కోట : ప్రకృతి కొలువులో దట్టమైన నల్లమల అడవుల్లోని అతి
పురాతనమైన కోటగా దీనిని పేర్కోనవచ్చు. కొల్లాపూర్ నుంచి 10 క్.మీ. ప్రయాణిస్తే,
అమరగిరి గ్రామం వస్తుంది. ఈ గ్రామం ప్రక్కనుంచి కృష్ణానదిలో 12 కిలోమీటర్లు బోటులో
ప్రయాణిస్తే ఈ కోట వస్తుంది. ఇది క్రీ.శ. 6 - 7 శతాబ్దాల నటిదని పురాతత్వ శాస్త్రవేత్తల
అభిప్రాయం. కృష్ణానదిలో 2 కి.మీ ఎత్తున గల కొండ పైకి కాలిబాట ద్వారా నడిచి
వెళ్ళడం ఓ సాహసకార్యం మనిషికన్నా ఎత్తుగా పెరిగిన కాసెగడ్డి, పిచ్కి మొక్కలు
తప్పించుకుంటూ నేర్పుగా వెళ్ళాలి. కొండపైన 500 ఎకరాల స్థలంలో విశాలమైన భూమి
ఉంది. ఈ కోటను అనుకుని ఉన్న కృష్ణాతీరంలో పురాతన దేవాలయాలను, ఆదిమానవుల
నాటి ఆవశేషా లను పురావస్తు శాత్రవేత్తలు కనుగొన్నారు. ఈ కోటచుట్టూ కందకాలున్నాయి.

ఈ కోటలో ఏ శతాబ్దం నాటిదో తెలియని ఆంకాళమ్మ గుడి ఉంది. కోట ప్రహరీ
గోడ దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంకా దీనిలో గుర్రపుశాల, రాజ మందిరాలు,
సిబ్బంది గదులు ఉన్నాయి. దీనికి సంబంధించి చారిత్రక ఆధారాలపై పరిశోధనలు
జరగాల్సివుంది. ఆంకాళమ్మ గర్బగుడికి సమీపంలో గల బావి ప్రక్కన శివలింగం, వినాయక
విగ్రహాలున్నాయి. ఇటీవలి కాలంలో గుప్త నిధుల ఆశతో ధనాశపరులు కోటలోని నివాస
గ్రహాలను, మెట్లను తవ్వి నాశనం చేసారు. దీనిని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం,
పురావస్తు శాస్త్రవేత్తలపై ఉంది.

2.5.0 కొల్లాపూర్ ప్రాంత దర్శనీయ స్థలాలు

2.5.0 దర్శనీయ స్థలాలు : కొల్లాపూర్ ప్రాంతం(నియోజకవర్గం) చారిత్రికంగా
సాంస్కృతికంగా ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రాంతం చారిత్రక కట్టడాలు, పురాతన గ్రామాలు,
దర్శనీయ స్థలాలను కలిగివుంది.

2.5.1పానగల్ ఖిల్లా : పానగల్ మండలంలో ఖిల్లా పానగల్ చారిత్రక ప్రసిద్ధిని పొందింది.
క్రీ.శ. 11వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ఈప్రాంతాన్ని పాలించిన బాదామి చాళుక్యులు
పానగల్ దుర్గాన్ని నిర్మించారు. ఈ దుర్గం సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తున ఉంది.
ఈ ఖిల్లాను గుట్టపై 5 చదరపు మైళ్ళ వైశాల్యంలో నిర్మించారు. ఈ పర్వత శ్రేణి మూడు
వైపులా విస్తరించి, గుర్రపునాడా ఆకృతిని పొంది, తూర్పు దిక్కున రెండు మొనలను కలిగిఉంది.
ఈ కోటను 60 బురుజులు, 20 అడుగుల ఎత్తున్న ప్రాకారాలతో శత్రు దుర్భేద్యంగా నిర్మించారు.

ఎత్తైన ఈ దుర్గంలో ఎన్నో గుడులు, గోపురాల్జు, బావులు, కుంటలున్నాయి. ఈ కోటపై శిథిలమైన గృహ సముదాయాలున్నాయి, ఈ కోటను ప్రధాన ద్వారమైన "ముండ్ల గవిని"
నేటికి చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం. క్రీ.శ. 1786లో నైజాం అలీఖాన్ బహద్దూర్
ఈ కోటలోని భవనంలో కొంతకాలం నివసించినట్లు ఆధారాలున్నాయి. 1800 అడుగుల
ఎత్తు కలిగిన ఈ దుర్గంలోని "రామగుండం "లో నీరు నిండుగా, స్వచ్ఛంగా వుండి చూపరులను
ఆకర్శిస్తోంది. ఇక్కడే శ్రీరాముడు సీతమ్మవారి పాదాలున్నాయి. చారిత్రక ఆధారాల్లోకి వెళితే
ఇక్కడ రెందుసార్లు యుద్దాలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా జానపదుల్లో ప్రసిద్ధమైన 'బాల
నాగమ్మకథ ' ఈ పానగల్ దుర్గానికి సంబంధం ఉందని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఈ
కోట దుర్గద్వారం సమీపంలో గండ శిలలపై శ్లోకాల సంస్కృత శాసనం ఉంది.
దీనిలో విజయనగర హరిహరరాయ, బుక్కరాయ సోదరుల ప్రశంస ఉంది. ఈ శాసనకాలం
క్రీ.శ. 1396.

పానగల్ రామగుండం సమీపంలో క్రీ.శ. 1424 నాటి సంస్కృత శాసనం ఉంది ఇంకా
పానగల్ కోటలో ప్రేమికుల ఉయాల, మక్కా మసీదు, ఫిరంగులను చూడవచ్చు. ఈ ఖిల్లా
పైభాగంలో గుప్త నిధులకోసం కొందరు ధనాశపరులు ఇందులోని ప్రతీ ప్రాంతాన్ని త్రవ్వి
వదిలేశారు అపురూపమైన దేవతా విగ్రహాలను తొలగించారు. నగర వైభవానికి నిలువుటద్దంగా
నిలిచిన పానగల్ ఖిల్లాను సంరక్షించి పునరుద్దరణ చేయకపొతే భవిష్యత్ తరాల వారికి
ఇక్కడ ఒక ఖిల్లా ఉండేదటా అని చెప్పుకోవల్సివస్తుంది. పానగల్లు మండలానికి మూడు
కిలోమీటర్ల దూరంలో బాలపీర్ల(బాలవీర్ల) దర్గా వుంది.

2.5.2సింగపట్టణం నృసింహసాగరం : కొల్లాపూర్ మండలంలోని సింగ పట్టణం
లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ పాదానికి ఎడమవైపున ఒక పెద్ద తటాకం ఉంది. ఈ
చెరువును సురభి వంశంలోని 19వ తరం వాడైన మల్లానయుని తమ్ముడు చంద్రికా పరిణయం
కర్త అయిన సురభి మాధవరాయలు త్రవ్వించారు. దీనిని నృసింహసాగరం(శ్రీవారి
సముద్రం)గా పిలుస్తున్నారు. జిల్లాలోని అతిపెద్దదైన చెరువుల్లో ఒకటిగా పేర్గాంచిన ఈ
చెరువు కట్ట పొడవు దాదాపు ఒక కిలోమీటరు. దీనిక్రింద 14 గ్రామాల్లోని 707
హెక్టార్ల భూమి(176.5 ఎకరాల భూమి) సాగవుతోంది.

సురభి వంశస్థులు స్వామి వారికి నిత్యపూజాభిషేకాలకు గాను ఈ తటాకం క్రింద 240
ఎకరాల మెట్ట, 12 ఎకరాల మాగాణి భూమిని 'ఇనాం 'గా ఇచ్చారు. దీన్ని దేవుని మాన్యంగా
వ్యవహారిస్తున్నారు. ఈ చెరువుకు సంబంధించి ఆసక్తికరమైన కథ ఒకటి ఈ ప్రాంతంలో
ప్రచారంలో ఉంది. ఈ తటాకాన్ని త్రవ్విన పనివారికి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం
ప్రకారం రూము(చెరువు తూము) నిండా ధనాన్ని ఇస్తానని రాజు వాగ్ధానం చేసి, తన
మాటను నిలబెట్టుకోలేకపోయాడట. పని పూర్తయిన తర్వాత అసంతృప్తి,, ఆగ్రహానికి లోనైనపనివారు ప్రతీ 7 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ చెరువు నింది అలుగు పారాలని
శపించారట దాని ప్రకారం ఇప్పటివరకు ఏడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ
తటాకంలోకి పూర్తిస్థాయిలొ నీరు నిండి అలుగు పారడం ఒక విచిత్రంగా చెప్పుకోవచ్చు.

కొల్లాపూర్ ....దీనికి నైసర్గికంగా ఎల్లలు :

తూర్పున : కొల్లాపూర్, పశ్చిమాన : పెబ్బేర్, ఉత్తరాన : పానగల్, దక్షిణాన : కృష్ణానది

ఈ మండలంలో వర్షాకాలం, శీతాకాలాల్లో సమశీతోష్ణస్థితి వుంటుంది. వేసవిలో ఎంతో
వేడిగా వుంటుంది. ఈ మండలంలో భూములు సారవంతమైన నల్లరేగడి భూములు. శ్రీశైలం
జలాశయం ముంపునకు ఈ మండలంలోని 11 గ్రామాలు నీట మునిగాయి. 79,732
ఎకరాల విస్తీర్ణం గల ఈ మండలంలో 4,200 ఎకరాల పచ్చికబయళ్ళు, 350 ఎకరాల
తోటలు, 11,350 ఎకరాల బీడు భూములున్నాయి. (1991 జనాభా లెక్కల ప్రకారం)

ఈ మండలంలో మొత్తం జనాభా : 45,516 :
పురుషుల సంఖ్య 23,296 స్త్రీల సంఖ్య : 22,220
మండల జనాభాలో అక్షరాస్యుల సంఖ్య : 17,916
పురుషులు : 11887 స్త్రీలు : 6,029
మొత్తం అక్షరాస్యతా శాతం : 39,36%
పురుషులు 61.03% స్త్రీలు : 27.13%
15 - 35 సంవత్సరాల వయస్సు గల వారిలో నిరక్షరాస్యుల సంఖ్య : 10,328
పురుషులు : 5,516 స్త్రీలు :5,172
(2001 జనాభా లెక్కల ప్రకారం)

2.3.0జటప్రోలు సంస్థానం : కవి పండితులు

జటప్రోలు సంస్థానం ఎందరో కవులకు, సాహితీవేత్తలకు
నిలయం. ఇక్కడ ఎందరో పండితులు విశిష్ఠమైన రచనలు కావించారు. జటప్రోలు సంస్థానంలో
అయ్యవారి పల్లె , మంచాల కట్ట పండిత గ్రామాలుగా వినుతికెక్కాయి. వెల్లాల సదాశివశాస్త్రి,
అక్షతల సుబ్బశాస్త్రి, అక్షతల సింగరశాస్త్రి, వెల్లాలరాఘవ జోస్యులు, వెల్లాల శంకరశాస్త్రి,
వెంకట రామశాస్త్రి మొదలైన వారు అయ్యవారి పల్లె గ్రామ వాస్తవ్యులు. కవితార్కిక
సింహ గోవిందాచార్యులు, గోపాలచార్యులు 'మంచాల కట్ట 'గ్రామానికి చెందినవారు.

2.3.1సురభి మాధవరాయలు : మాధవరాయలు రాజు మాత్రమే కాదు స్వయంగా
పండితుడు కూడా. వీరి కాలం (క్రీ.శ. 1530 - 1600).వీరు జటప్రోలు సింహాసనాన్ని
అధిష్ఠించి పరిపాలన సాగించారు. ఇతను మల్ల భూపతి మూడవ కుమారుడు. ఈ వంశంలో
19వ తరం వాడైన మల్లానాయుని తమ్ముడు. మాధవరాయలు చంద్రికా పరిణయం అనే
ప్రౌఢ ప్రబంధాన్ని రచించాడు. ఇది రామరాజ భూషణుని వసు చరిత్రకు ధీటైన శ్లేషకావ్యంగా
ప్రసిద్ధికెక్కింది. ఇతనికి తర్క, అలంకార, సంగీత, వ్యాకరణ శాస్త్రాల్లో పాండిత్యం ఉంది.

చంద్రికా పరిణయం ఆరు ఆశ్వాసాల కావ్యం. ఇందులో నాయిక చంద్రిక, నాయకుడు
సుచంద్రుడు. ఈ కావ్యాంలో నాయిక అయిన చంద్రిక పరిణయాన్ని కథా వస్తువుగా చేసుకోవడం
చేత దీనికి 'చంద్రికా పరిణయం 'అనే పేరు వచ్చింది. చంద్రిక అంటే 'వెన్నెల ' .కనుక దీనిలో
వెన్నెల రాత్రి కథ వుంటుంది. చంద్రికకు చంద్రునితో వివాహం చేసినవాడు మాధవరాయలు.
ఈ కావ్యంలో శృంగారం ప్రధాన రసం. కావ్యారంభాన్ని శ్రీ వక్షోజధర స్ఫురద్వరి మురస్సీమన్..
అనే శార్దూల వృత్తంతో శుభ ఫలప్రదంగా సాగించడం వలన ఈ కవి సత్ సంప్రదాయ వేత్త అని చెప్పవచ్చు.

2.3.2ఎలకూచి బాల సరస్వతి : ఈ కవి సురభి మాధవరయల ఆస్థానంలో విద్వత్
కవిగా వాసికెక్కాడు. ఇతను పాకనాటి వైదిక బ్రహ్మణుడు. ఇతని తల్లిదండ్రులు లక్ష్మమ్మ,కిష్టయ్య.
14వ పేజి ********** కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు - ఒక పరిశీలన
ఈ కవి అసలు పేరు వెంకట కృష్ణరాయలు. ఇతను మాధవరాయల తండ్రి అయిన
మల్లానాయుని పేరిట భర్తృహరి సుభాషితాలను 'మల్ల భూపాలీయం ' పేరుతో ఆంధ్రీకరించాడు.
ఇతని రచనలు : రంగ కౌముది(నాటకం), చంద్రికా పరిణయం, భ్రమరగీతి,
కార్తికేయాభ్య్యుదయం(కావ్యాలు); రాఘవ యాదవ పాండవీయం(త్ర్యర్థికావ్యం)
సుభాషిత త్రిశతి , భర్తృహరి త్రిశతికి అనువాదం.

2.3.3యణయవల్లి కృష్ణమాచార్యులు : వీరు వ్యాకరణం, జ్యోతిష శాస్త్రం. సాహిత్యాల్లో
మంచి విద్వత్ కలవారు. వీరు జటప్రోలు సంస్థాన విద్వాంసులుగా ఖ్యాతినొందారు. వనపర్తి,
గద్వాల పండిత సభల్లో విజయభేరి మోగించారు. వీరి కాలం శాలివాహన శకం
(1720-1780). వీరు అష్టప్రాస రామశతకం, శ్రీకృష్ణ చంపువు, నిరోష్ఠ్య కృష్ణ శతకం,
రసఙ్ఞానానందము, జాతక చంద్రికా వ్యాఖ్య అనే కృతులు రాశారు.

2.3.4 అక్షతల సుబ్బశాస్త్రి : వీరి స్వస్థలం జటప్రోలు సంస్థానంలోని అయ్యవారి పల్లె,
వీరు కాశీ నగరంలో తర్క, వ్యాకరణ మీమాంసాది శాస్త్రాలను చదివారు. కొల్లాపూర్,
గద్వాల, వనపర్తి, ఆత్మకూరు పండిత సభలలో విజయ ఢంకా మోగించారు. వీరి ప్రసిద్ధ
భాష్యార్థ రత్నమాల, శ్రీ శంకర భగవత్పాదుల శారీరక మీమాంసకు భాష్యం రచించారు.

2.3.5 వెల్లాల సదాశివశాస్త్రి : ఈ కవి సురభి వంశంలోని 27వ తరం వాడైన సురభి
వెంకట లక్శ్మారావు ఆస్థానంలో శాస్త్ర చర్చలు సాగించారు. వీరి స్వగ్రామం అయ్యవారి పల్లె.
వీరు కాశీ నగరానికి వెళ్ళి వ్యాకరణ, తర్క, అలంకార శాస్త్రాలను చదివారు. జటప్రోలు
సంస్థాన ఆస్థాన పండితులుగా నియమితులై 80 ఎకరాల భూమిని 'ఇనాం 'గా పొందారు.
వీరు అవధానం శేషశాస్త్రి గారితో కలిసి చంద్రికా పరిణయం ప్రబంధానికి వ్యాఖ్యను
వెలువరించారు. సదాశివశాస్త్రి శా.శ 1783 దుర్మతి నామ సంవత్సరంలో జన్మించారు. వీరి
ముద్రిత రచనలు కన్యకాంబ చంపువు (సంస్కృతం); వెలుగోటి వంశ చరిత్ర, సురభి వంశ
చరిత్ర, కంఠీరవ చరిత్రం.
అముద్రితాలు : స్త్రీ ధర్మ కరదీపిక, అచ్యుత స్వామి చరిత్రం, అఖ్యాత చింతామణి, శబ్దతత్వ ప్రకాశిక .

2.3.6వనం సీతారామ శాస్త్రి : వీరు తర్క, వ్యాకరణ, ధర్మ శాస్త్రాలలో గొప్ప పండితులు.
వీరికి 'తర్కసింహ ' అనే బిరుదు వుంది. వీరి కావ్యాలు సోమవార వ్రత నిర్ణయం, దోషాభాస
నిరాసము. వీరిని రాణి రత్నామాంబ ఆదరించింది.

2.3.7కేశవ పంతుల నరసింహా శాస్త్రి : వీరు పల్లెపాడు గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు.
కొల్లాపూర్ ప్రాంత సంక్షిప్త పరిచయం *************** 15వ పేజి
వీరు వ్యాకరణ, అలంకార, తర్క శాస్త్రాల్లో పండితులు, సంస్కృతంలో బాల బ్రహ్మేశ్వర సుప్రభాతాన్నిరచించారు.
రఘు వంశము కావ్యానికి తెలుగు వ్యాఖ్యానం రాశారు.

2.3.8చెరుకుపల్లెనరసింహ సిద్దాంతి : వీరు చుక్కాయ పల్లె వాస్తవ్యులు. వీరి రచనలు :
సంగమేశ్వర శతకం, సంగ్రహ భారతం ముద్రితాలు. సింగ పట్టణ నరసింహ శతకం,
సింగపట్టణ నరసింహ విలాసం, సింగ పట్టణ నృసింహక్షేత్ర మాహాత్మ్యం అముద్రితాలు.

2.3.9 :ఓరుగంటి లక్ష్మినారాయణ :వీరు సింగపట్టణ వాస్తవ్యులు. వీరి తల్లిదండ్రులు :
రామలక్ష్మమ్మ, సీతారామయ్య గార్లు. వీరు శ్రీవత్సస గోత్రులు. "సింగపట్టణం లక్ష్మీ
నృసింగస్వామి చరిత్రం" వీరి కృతి. ఇది వచన రచన వీరిని రాణి రత్నమాంబ ఆదరించింది.

వీరేగాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కవి, పండితులు కూడా ఈ సంస్థాన
ప్రభువుల సత్కారాలు అందుకున్నారు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిగారు,
బలిజేపల్లి లక్ష్మికాంతం కవిలాంటి వారు కొల్లాపూర్ సంస్థానాన్ని సందర్శించి సురభి
వంశీయుల సత్కారాలు పొందారు.
కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు - ఒక పరిశీలన

2.2.0 కొల్లాపురం(జటప్రోలు) సంస్థానం : జటప్రోలు సంస్థానం

కొల్లాపురం(జటప్రోలు) సంస్థానం మహబూబ్ నగర్ జిల్లాలోనిది.
ఈ సంస్థానం 191 చదరపు మైళ్ళ విస్థీర్ణం కలిగి వుంది.
ఇందులో 89 గ్రామాలున్నాయి. ఈ రాజులు విజయనగర ప్రభువులకు, గోల్కొండ సుల్తానులకు,
అసఫ్ జాహి వంశస్తులకు సామంతులు. తర్వాతి కాలంలో ఈ సంస్థానం రాజా లక్ష్మణరాయల
హయాంలో కొల్లాపూరు కు మారిపోయింది ఈ సంస్థానం ఆదాయం సాలీనా రెండు లక్షలు.2
"వికలిత పంకజాత నవ విభ్రమమై, ఘన గోధ్రతాభి భూ..." అను చంపకమాలవృత్తపద్యం
చంద్రికా పరిణయం పీఠికలోని 18వ పద్యం. దీనిద్వారా చెవ్విరెడ్డి గణపతి దేవుని
దగ్గర సేనా నాయకుడిని రేచర్ల గోత్రజుడని, 36 వంశములకు ఇతనే మూల పురుషునిగా
భావించేవాడని తెలుస్తోంది. ఇతనికే భేతాళనాయకుడనే పేరుంది. నేటికి కొల్లాపురం సురభి
వంశస్తుల శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంలో ఈ భేతాళ నాయకునికి పూజలను జరిపిస్తూ,
బలులు ఇస్తున్నారు. 3

ఈ సంస్థాన ప్రభువులు సురభివారు రేచర్ల గోత్రోద్భవులైన వెలమవారు. వేంకటగిరి,
పిఠాపురం, బొబ్బిలి, కొల్లాపూర్ రాజవంశీకులకు మూల పురుషుడు చెవ్విరెడ్డి అను
నామాంతరం కలిగిన ఈ పిల్లలమర్రి భేతాళనాయుడు. ఇతని జననం క్రీ.శ. 1187. పాలనా
కాలం క్రీ.శ. 1195 నుంచి 1206 వరకు. వీరి వంశంలో 13వ తరం వాడైన మాదానాయుడు
జటప్రోలు శాఖవారికి మూల పురుషుడు 14వ తరం వాడైన మల్లానాయుడు క్రీ.శ. 1527లో
అనెగొంది రామదేవరాయల వల్ల జటప్రోలు సంస్థానాన్ని పారితోషికంగా పొందాడు.
వారి క్రింద సామంత రాజుగా ఏలుబడి సాగించాడు.

ఈ తరంలో 19వ తరం వాడైన కుమార మల్లనాయుని తమ్ముడు సురభి మాధవరాయలు
'చంద్రికా పరిణయం ' అనే ప్రౌఢ కావ్యాన్ని రాశాడు. ఇది రామరాజ భూషణుడు రచించిన
వసు చరిత్రకు సమకాలీన రచన అని క్రింది పద్యం ద్వారా తెలుస్తోంది.

ఉ|| "సురభి కులామలాబ్ధి బొడచూపిన 'మాధవరాయ ' చంద్రుడా
సరస పదార్థ రంజనము, సత్కవి హృద్యము గాగ "చంద్రికా
పరిణయమున్" రచించెనది భావ్యము; నీవసు చర్య చూడగా
బరగె నిగూఢ వృత్తి, నటు నీకును వర్తిలె మూర్తి నామమున్"

వెల్లాల సదాశివ శాస్త్రిగారు రచించిన "సురభి వారి వంశ చరిత్ర 'లో
ఉదహరించిన వృత్తపద్యమిది. దీనికర్త ఎవరో తెలియదు. 4

వెంకటగిరి సంస్థానాధీ శులకు మధ్యకాలంలో వెలుగోటి వారు అనే పేరు వచ్చినట్లే
వీరికి'సురభి 'వారు అనే పేరు వచ్చింది . చంద్రికా పరిణయం కావ్యంలో 'సురభి ' అనే పదం పరిమళార్థకము /కామధేనువులుగా అర్థపరంగా వివరించారు.
శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రిగారు 'సురభి ' అను దీర్ఘాంతం దేవతలకు కూడా భయం కలిగించునదని చెప్పారు.
ఇది భేతాళనాయని మాహాత్మ్యాన్ని సూచిస్తుంది. ఇది కాలక్రమేణా 'హ్రస్వాంతమై 'సురభిగా మారింది.
పురాణాల్లో దేవతల గోవుగా సురభిని వర్ణించారు. ఏది ఏమైనప్పటికీ సురభి అనేది ప్రాచీన నామం.
సురభి వంశస్తులు బెక్కెం ,పెంట్లవెల్లి, వెల్లూరు గ్రామాలలో కోటలు కట్టి, తటాకాలు
త్రవ్వించి, దేవాలయాలు కట్టించి, దేవతా ప్రతిష్ఠలు చేసి సుమారు 165 సంవత్సరాల
క్రితం ప్రస్తుత కొల్లాపుర్ ను రాజధానిగా చేసుకొని పరిపాలన చేసారు. వీరి వంశంలో ప్రస్తుతం
శ్రీ సురభి వెంకటకుమార కృష్ణ బాలాదిత్య లక్ష్మారావు హైద్రాబాద్ లో నివసిస్తున్నారు.
కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు - ఒక పరిశీలన

2.0.0 కొల్లాపూర్ ప్రాంత సంక్షిప్త పరిచయం

2.1.0 కొల్లాపూర్ చరిత్ర : కొల్లాపూర్ తాలుకాకు పూర్వనామం జటప్రోలు సీమ. ఇది
కొల్లాపూర్ కు కొంత దూరంలోని ప్రాంతం. జటప్రోలు కృష్ణాతీర గ్రామం. ఇక్కడగల కోట,
ఆలయం శ్రీశైలం జలాశయంలో గురి అయినాయి. అంతకుముందే మదనగోపాల
స్వామి ఆలయాన్ని కృష్ణానది ఒడ్డున పునర్ నిర్మించి ప్రతిష్ఠించారు. కొల్లాపూర్ చరిత్రను
పరిశీలిస్తే క్రీ.శ.1840 వరకు ఇది రాజధాని కాదు. 'కొలుముల పల్లె' అనే సామాన్య గ్రామం.
పూర్వం ఇక్కడ కంచరి [కమ్మరి]కొలుములు నడిపేవారు . కనుక 'కొలుముల పల్లె' గా మారి నేడు
కొల్లాపూరంగా వాసికెక్కింది. గతంలో కొల్లాపూర్ రాజధాని ఎల్లూరు. ఎల్లూరు నుంచి రాజధాని
నగరాన్ని రాజ వెంకట లక్ష్మారావు హయాంలో కొల్లాపూర్ కు మార్చి దానిని అభివృద్ధి చేశారు

ఎల్లూరు కృష్ణాతీరంలోని అగస్తేశ్వరం, సోమేశ్వరం అలయాలు కట్టిన శిల్పులకు ఇచ్చిన
స్థలం. ఎల్లోజు, మల్లోజు, సోమోజు అనువారు ముగ్గురు సోదర శిల్పులు. ఎల్లూరు స్థలాన్ని
పొందిన పిమ్మట ఈ సోదరులు అక్కడ ఒక గ్రామాన్ని స్థాపించుకొని, కొంతకాలం ఈ
ప్రాంతానికి దొరలుగా చెలామణి అయినారు. వీరి రాజ్యం నేటి సింగోటం(సింగపట్టణం)
వరకు వ్యాపించింది. పెద్దవాడైన శిల్పి 'ఎల్లోజు 'పేరిట సోదర శిల్పులు ఎల్లూరును స్థాపించి,
అక్కడ పెద్దకోటను నిర్మించి దానిలో విశ్వకర్మను, సానగమహర్షిని ప్రతిష్ఠించారు. "ఓడలు
బండ్లవుతాయి - బండ్లు ఓడలవుతాయి "..... అన్నట్లుగా ఎల్లోజు వంశం వారు ఆచా రభ్రష్ఠులై తమ
గ్రామాలను సురభి వంశస్తులకు విక్రయించి వెళ్ళిపోయారు. 1


క్రీ.శ. 1840లో రాజా లక్ష్మణ రాయలు జటప్రోలు నుంచి రాజధానిని కొల్లాపూరు కు
మార్చివేశారు. నిజాం ప్రభువుచే రాజా బహద్దూర్, నిజాం నవాజ్ పంత్ బిరుదులు స్వీకరించిన
రాజా లక్ష్మీ జగన్నాథ రావు కొల్లాపూరాన్ని 1851 నుంచి 1854 వరకు పరిపాలించారు.
రాజా వెంకట జగన్నాథరావు హయాంలో కొల్లాపూరం సంస్థానం హైద్రాబాద్ రాష్ఠ్రంలో
విలీనమైంది.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కొల్లాపూర్ ప్రాంతానికి(నియోజకవర్గం) ఇంతవరకు
11 మంది శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1852 సంవత్సరంలో ఏర్పడిన కొల్లాపూర్
నియోజకవర్గానికి ప్రప్రథమంగా.... అనంత రామచంద్రారెడ్డి(పి.డి.ఎఫ్) శాసనసభ్యుడు .
ప్రస్తుత శాసన సభ్యుడైన జూపల్లి కృష్ణారావు(స్వతంత్ర అభ్యర్థి) పన్నెండవ అభ్యర్థి.

Sunday, February 7, 2010

కొల్లాపూర్ మండలం యొక్క స్థానము



కొల్లాపూర్

మహబూబ్ నగర్ జిల్లా పటములో కొల్లాపూర్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో కొల్లాపూర్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)

ముఖ్య పట్టణము కొల్లాపూర్
జిల్లా(లు) మహబూబ్ నగర్
గ్రామాలు 24
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ 64,180 (2001)
• 32980
• 31190
• 44.62
• 56.27
• 32.30


కొల్లాపూర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము.
[] మండలంలోని గ్రామాలు

* చింతలపల్లి
* నర్సింహాపురం
* ఎన్మనబెట్ల
* మాచినేనిపల్లి
* జవాయిపల్లి
* సింగవట్నం
* చౌటబెట్ల
* చుక్కాయిపల్లి
* అంకిరావుపల్లి
* కుడికిళ్ళ
* నార్లపురం
* మాలచింతపల్లి
* ఎల్లూర్
* వర్ద్యాల్
* కొల్లాపూర్
* నర్సింగరావుపల్లి
* పెంట్లవెల్లి
* మంచాలకట్ట
* రామాపూర్
* వేంకల్
* మల్లేశ్వరం
* సోమశిల
* అమరగిరి
* బొల్లారం

Thursday, February 4, 2010