ABN -ANDHRA JYOTHI

ABN Andhrajyothy Live TV

Thursday, March 25, 2010

2.5.5 కల్వకోలు చారిత్రక శివాలయం :

పెద్ద కొత్తపల్లి మండల కేంద్రానికి 15 కి.మీ
దూరంలో కల్వకోలు గ్రామం ఉంది. దీన్ని పూర్వం 'కైరకాసారపూరపురం ' అనేవారు.
ఊరి వెలుపల నందికేశ్వరుడి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఈశాన్య దిశలో వున్న
'కల్వపూల కొలను'పేరుమీదుగా ఈ ఊరికి కల్వకోలు అని పేరు వచ్చినట్లు తామ్రపత్ర
శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ. 1247 దుర్మతీనామ సంవత్సరంలో నందికేశ్వరుడి
ఆలయాన్ని, జయలక్ష్మీపతి అనబడే గోన ప్రభువు ఈ ఆలయాన్ని కట్టించినట్లు తెల్సుస్తోంది.
తర్వాతి కాలంలో అనగా 1423 శాలివాహన శకంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పానుగంటి
శేషా చలపతి రాజు ఈ ఆలయాభివృద్ధికై పంటభూములను దానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత వుంది. ఏడు శివలింగాల ఒకదానిపై
మరొకటి ఉండేలా తీర్చిదిద్దారు. శిల్పి శివలింగ పాన పట్టాలను లింగంతో సహా గిన్నెల వలె
మడిచి ఒకదానిపై మరొకటి రూపొందించాడు. అంతేగాకుండా పాన పట్టాలకు లింగం
చుట్టూ సూక్ష్మమైన రంధ్రాలను చెక్కినారు. ఆ శివలింగానికి భక్తులు అర్చించే అభిషేక
జలం ఏడింటికీ అందుతూ సప్త లింగాభిషేకం ఒకేసారి జరిగేలా ఏర్పాటు చేసిన శిల్పి కళా
కౌశలం ప్రశంసనీయం. ముస్లింల దండయాత్ర వలన ఈ శివలింగం పైభాగం విరిగిపోయింది.
ఇక్కడ ఆలయం ముందు గల మరో నందిని గుప్త నిధుల ఆశతో దుండగులు నడుము
వరకు విరగ్గొట్టారు. 1968 సంవతరంలో దేవాలయ పరిసర ప్రాంత రైతులు తమ
పొలాల్లో త్రవ్వకాలు సాగిస్తుండగా వీరభద్రుడి విగ్రహంతో పాటు ఒక దీర్ఘచతురస్రాకార
శిలా శాసనపు రాతిస్థంభం ఒకటి బయల్పడింది. ఈ ఆలయంలో ఆలనాపాలనా లేక, సంరక్షణ
కరువైన విలువైన శిల్పసంపద ఎంతో వుంది. అపురూపమైన శిల్పాలు ఎండకు ఎండుతూ,
వానకు తడుస్తూ శిథిలావస్థకు చేరుకోవడం చూపరులను కలచివేస్తుంది.

No comments:

Post a Comment